ప్రతిపక్షాలను మట్టి కరిపించిన లోకనాయకుడు:వై.ఎస్‌

Image30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తనకు తానే సాటి అని వై.ఎస్‌. మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ..
చరిత్రలో ఐదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా కొనసాగి సువర్ణ అధ్యాయానికి తెరతీశారు. ఎమ్మెల్యేగా 6 సార్లు గెలుపొంది డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా… అన్నీ తానై కాంగ్రెస్‌ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. ఇటీవల జరిగినఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతిపక్షాలను మట్టి కరిపించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న లోకనాయకుడు వై.ఎస్‌.పై టీవీఫైవ్‌ ప్రత్యేక కథనం.
           1949 జూలై 9వ తేదీన వైఎస్‌ రాజారెడ్డి, జయమ్మలకు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి రెండవ సంతానంగా జన్మించారు. కడప జిల్లాలోని బలపనూరు స్వగ్రామమైనప్పటికీ వై.ఎస్‌. రాజారెడ్డి … పులివెందులలో స్థిరపడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పులివెందుల, బళ్ళారిలలో చదువు కున్నారు.. బళ్లారిలో చదువుకుంటున్న సమయంలోనే కమ్యూనిస్టు నాయకుడు గురువు వద్ద …అభ్యుదయ సాహిత్యాన్ని అభ్యసించారు. ఆ తరువాత విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివారు.. అనంతరం కర్ణాటకలోని గుల్బర్గాలో ఎం.ఆర్‌. మెడికల్‌ కాలేజ్‌లో యం.బి.బి.ఎస్‌. పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న వై.ఎస్‌.కు మిత్రబృందం తక్కువేం కాదు. విద్యార్థి నాయకుడిగా ఎన్‌.సి.సి. విద్యార్థిగా చురుకైన పాత్ర పోషించారు. వైద్య విద్య పూర్తికాగానే 1972లో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో మేనత్త రత్నమ్మ వద్ద డాక్టరుగా శిక్షణ ప్రారంభించారు. 1972 ఫిబ్రవరి 9వ తేదీన సింహాద్రిపురం మండలంలోని అంకాళమ్మ గూడూరుకు చెందిన బస్‌ యజమాని పోచంరెడ్డి రామానుజులరెడ్డి కుమార్తె విజయలక్ష్మితో వై.ఎస్‌.కు వివాహం జరిగింది. వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి, షర్మిల ఇద్దరు రాజశేఖరరెడ్డి సంతానం. 1974లో పులివెందులలో తన తండ్రి రాజారెడ్డి పేరు మీద 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతో పేద ప్రజలకు స్వయంగా మెరుగైన వైద్య సేవలు అందించారు.. తక్కువ సమయంలోనే మంచి హస్తవాసి గల వైద్యునిగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1975లో తన మిత్రుడు టి.విజయ్‌ ప్రకాశ్‌ రెడ్డి ద్వారా యువజన కాంగ్రెస్‌లో చేరి రాజకీయ ఆరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే తన వాక్చాతుర్యంతో రాజీవ్‌గాంధీ దృష్టిలో పడ్డారు. 1977 వ సంవత్సరంలో… అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కడప యం.పి. అభ్యర్థి కందుల ఓబుల్‌రెడ్డికి మద్దతుగా పులివెందులలో వై.ఎస్‌. ముమ్మరంగా ప్రచారం చేశారు. 1978లో… రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. 1981లో అంజయ్య మంత్రివర్గంలో తొలిసారిగా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఎక్సైజ్‌ శాఖ, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి రెండు పర్యాయాలు అధ్యక్షులుగా మరో రెండు సార్లు సి.ఎల్‌.పి. నాయకుడిగా పనిచేసిన వై.ఎస్‌. పదవులకు వన్నెతెచ్చారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 2004 ముందు వరకు వై.ఎస్‌. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. వన్నె తగ్గని నాయకుడిగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం 2004 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మారథం పట్టారు. మొట్టమొదటిసారిగా 2004 మే 14వ తేదీన ముఖ్యమంత్రిగా వై.ఎస్‌. బాధ్యతలు చేపట్టారు. దేశచరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ ఋణాలు, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలతో వై.ఎస్‌. ప్రజలలోకి చొచ్చుకొని పోయారు. వై.ఎస్‌.ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు రెండు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రతిపక్షాల ఎత్తుగడలను వైఎస్‌ చిత్తు చేశారు. ప్రజారాజ్యం ఆవిర్భావంతో కొంత ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించినప్పటికి కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. సొంత పార్టీ నేతలు సైతం ప్రత్యేక తెలంగాణా నినాదంతో వై.ఎస్‌.ను కొంత ఇరకాటంలో పడేసినప్పటికి వై.ఎస్‌. చలించలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి తాను నమ్మిన సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటించే వై.ఎస్‌. వెనకడుగు వేయలేదు. 30 సంవత్సరాలకు పైగా వై.ఎస్‌. వెన్నంటి వున్న పులివెందుల ప్రజలు ఈసారి కూడా అత్యధిక మెజారిటీ తెచ్చిపెట్టారు. 1978 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ప్రజలు ఈసారి ఏకంగా 68,681 ఓట్ల అత్యధిక మెజారిటీతో వైఎస్‌ పట్టంగట్టారు. ఎమ్మెల్యేగా డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన వై.ఎస్‌. …కడప పార్లమెంటుకు సైతం నాలుగు పర్యాయాలు గెలిచి రికార్డు సాధించారు. ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను తన సత్తా చాటుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న వై.ఎస్‌. లోకనాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Short URL: http://www.andhranews.in/?p=257

Posted by on May 21 2009. Filed under News. You can follow any responses to this entry through the RSS 2.0. Both comments and pings are currently closed.

Comments are closed

Log in |Designed by Gabfire themes WordPress Blog
Wp Advanced Newspaper WordPress Themes Gabfire