Archive for: October, 2009

ఉగ్రవాద దాడులతో భయపడేది లేదు: మూన్

ఆఫ్గనిస్థాన్‌లోని కాబుల్ ప్రాంతంలోనున్న తమ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినంత మాత్రాన తాము భయపడేది లేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది.ఆఫ్గన్‌లోని కాబుల్‌లోనున్న ఐరాస కార్యలయంపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడులతో తమను బెదిరించినట్లు తాము భావించడం లేదని, వచ్చే వారంలో అక్కడ జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాంకీమూన్ తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు తాము భయపడేది లేదని, ముఖ్యంగా తాము ఆఫ్గనిస్థాన్‌లోని పౌరులకు, ప్రభుత్వానికి సహాయ సహకారాలందిస్తామని ఆయన అన్నారు.తాలిబన్ ఉగ్రవాదులు ఐరాసా అతిథిగృహంపై దాడులకు పాల్పడటంతో అందులోనున్న ఐదగురు సిబ్బంది మృతి చెందారని, మరో 11 మంది తీవ్ర గాయాలపాలైనారని ఆయన తెలిపారు. తాలిబన్లు అక్కడి ప్రజలకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకూడదని హెచ్చరికలు జారీ చేసిందని, దీనిని తాము సహించమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేలా తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పాకిస్థాన్‌లో జరిగిన దాడులపై ఆయన స్పందిస్తూ… బుధవారం పాక్‌లో జరిగిన కారు మానవ బాంబు దాడుల్లో దాదాపు 95 మంది మృతి చెందారని, మరో 213 మంది తీవ్ర గాయాలపాలైనారన్నారు. ఈ దుర్ఘటనలో చాలామంది అమాయకులు బలైనారన్నారు. ఇలాంటి సంఘటన చాలా దారుణమని, దీనిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు.

ముష్కరులపై చర్యలు సంతృప్తికరంగా లేవు: ప్రధాని

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మారణహోమానికి పాల్పడిన ముష్కరులపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ దాడులకు కుట్రపన్నిన, సుత్రధారులుగా భావిస్తున్న వారు పాక్ వీధుల్లో యధేచ్చగా తిరిగేలా పాక్ చర్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యటన ముగించుకుని రాజధానికి బయలుదేరే ముందు ఆయన శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ముంబై ముష్కరులపై చేపట్టిన చర్యల పట్ల మేం సంతృప్తికరంగా లేం. ఇప్పటికైనా 26/11 దాడులకు బాధ్యులైన వారిని పాక్ పాలకులు చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. గత యేడాది జరిగిన ఈ మారణహోమానికి తమ దేశ గడ్డపైనే కుట్ర జరిగినట్టు పాకిస్థాన్ అంగీకరించింది. ఈ దాడుల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఇదిలావుండగా, బుధవారం పొరుగు దేశంలో స్నేహాస్తం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన మన్మోహన్ సింగ్ రెండో రోజున ముంబై దాడుల ప్రస్తావన తెచ్చి పాక్ తీరును ఎండగట్టడం గమనార్హం. ప్రతిపాదించిన చర్చలు సజావుగా ముందుకు సాగాలంటే పాక్ గడ్డపై ఉన్న తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలన్న షరతు విధించారా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ కాదన్నారు. అయితే, ముందుకు వెళ్లాలంటే ఇది ప్రయోగాత్మక మార్గమన్నారు. అలాగే, బలూచిస్థాన్ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న తాలిబన్ తీవ్రవాదులకు భారత్ ఎలాంటి సాయం చేయలేదని ప్రధాని తేల్చి చెప్పారు. పాక్ అంతర్గత మంత్రి రెహ్మాన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా మన్మోహన్ స్పష్టం చేశారు.

ఇంటి ముందు ముగ్గులు వేయాలంటే…!

గతంలో ఇంటి ముందు ముగ్గులు అందంగా వేసేవారు. చాలామందికి ఇప్పుడు ప్రతి రోజు యాంత్రికమైన జీవితంలో పడిపోయి రంగవల్లులను చిత్రీకరించే సమయమే దొరకడం లేదు. దీనికి ముందుగానే పెయింట్‌తో ముగ్గులు వేసేస్తున్నారు. గతంలో ముదురు రంగులతో ముగ్గులు వేసుకొనేందుకు ఇష్టపడేవారు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. కాని ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రధానంగా పట్టణాలు, నగరాలలోని ఫ్లాట్‌ల ముందు ముదురు రంగులతో ముగ్గులను వేస్తున్నారు. దీంతో ఇంటికి కొత్త అందం వస్తుంది. రంగులతో పెయింటింగ్‌లో షేడ్లు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. మీరు ఇంటి లోపల, అలాగే ఇంటి బయట ముగ్గులు పెయింట్‌తో వేయాలనుకుంటే పసుపు, ఎరుపు రంగులు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు కనపడే ఈ రంగులు మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. వీటితో మీకు నచ్చిన డిజైన్లలో ముగ్గులు వేసి ఆనందించండి.

కంప్యూటర్ టేబుల్ ఎలా ఉంది…!

ఇంట్లోనున్న మీ కంప్యూటర్‌ టేబుల్ ఎలా ఉందో చూశారా…! టేబుల్ చిన్నదే అయినా దాన్నిండా పుస్తకాలు, పెన్నులు, చిన్న చిన్న కాగితాలు, సీడీలు, చిల్లర, డైరీలు ఇలా బోలెడు వస్తువులను అక్కడ పడేస్తుంటాము. టేబుల్‌ను అందంగా సర్దుకోవాలంటూనే ఉంటారు. కాని సమయం లేదని చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.** మీ రోజువారీ కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనులు, సంప్రదించాల్సిన వ్యక్తులు ఇలా ఎన్నో వివరాలను మనం డైరీలో రాసుకుంటుంటాం. అలాగే ఓ డిస్‌‌ప్లే బోర్డులో మీరేమేం చేయాలో రాసి కంప్యూటర్ టేబుల్ సమీపంలో తగిలించండి. ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఒకే రంగుతో దానిపై రాసేకంటే నాలుగైదు రంగుల పెన్నులతో రాస్తే అవి మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. దీంతో కనీసం ఆదివారం లేదా మీకు వెసలుబాటు కలిగిన సమయంలోనైనా కంప్యూటర్ బల్లను శుభ్రపరచుకునేందుకు వీలుకలుగుతుంది. పనిచేసుకునేందుకు అనువుగానూ ఉంటుంది.

"సురేఖ" రాజీనామా వెనుక "జగన్" ప్రోద్బలం లేదు..!

మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ రాజీనామా వెనుక వైఎస్సార్ తనయుడు జగన్ ప్రోద్బలం ఉందని పార్టీలోని ఓ వర్గం చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. సురేఖ రాజీనామా ఆమె వ్యక్తిగత విషయమని మొయిలీ అన్నారు.గ్రేటర్ ఎన్నికలపై చర్చించడానికి నగరానికి వచ్చిన మొయిలీ పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా గ్రేటర్ ఎన్నికలు, సీఎల్పీ సమావేశం, కొండా సురేఖ రాజీనామా వ్యవహారం వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ.. సీఎల్పీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని భావించినా వరదలు, మూడు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపే కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమవుతుందని మొయిలీ స్పష్టం చేశారు.

గ్రేటర్ ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే 33 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 11 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. ఇంకా ఈ అభ్యర్థులలో 24మంది బీసీలు ఉన్నారు.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ హయాంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో తాను గెలవడం ఆ పార్టీతో పొత్తువల్ల సాధ్యం కాదని నిరూపించుకోవాలని బండారు దత్తాత్రేయ కృతనిశ్చయంతో ఉన్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎన్నికల కంటే ఉద్యమం ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పిన కేసీఆర్, శనివారం మరోమారు గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానంతరం తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనం

స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం పతనం కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్లు కోల్పోయి 16,101 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 4,784 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.12 శాతం, నిఫ్టీ 0.88 శాతం మేరకు క్షీణించాయి.డీఎల్ఎఫ్, ఆర్‌కామ్, భెల్, జేపీ అసోసియేట్స్, టాటా మోటార్స్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉండగా.. సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ యునిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా పవర్, ఐటీసీ, గ్రాసిం తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2,643 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,803 కంపెనీల వాటాలు నష్టాల చవిచూడగా.. 770 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.

నవంబరులో తెరపైకి రానున్న కరిష్మా కొటక్ "గ్లామర్"

గతంలో ప్రత్యూష, సర్ధార్ చిన్నపరెడ్డి, అయ్యప్పదీక్ష, రంగులకల, టి.నగర్ (తమిళ్) వంటి 15 చిత్రాలు నిర్మించిన నటుడు, దర్శక నిర్మాత పి. సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో “గ్లామర్” చిత్రం రూపుదిద్దుకుంటోంది. “శంకర్‌దాదా జిందాబాద్” ఫేమ్ కరిష్మాకొటక్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కరిష్మా కొటక్ మాట్లాడుతూ.. శంకర్‌దాదా జిందాబాద్ విడుదలైన తర్వాత తెలుగు నిర్మాతల నుంచి అనేక ఆఫర్స్ వచ్చినా కథలు నచ్చక అంగీకరించలేదు. దర్శకనిర్మాత సత్యారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. సరైన అవగాహన లేకుండా సినీరంగంలో పైకి రావాలన్న తపనతో గ్లామర్ పరిశ్రమ గురించి రంగుల కలలు కని ఇక్కడికి వచ్చి మోసపోయే వారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉపయోగపడుతుందని కొటక్ చెప్పింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో తనకు మరిన్ని చిత్రాల్లో అవకాశాలు లభిస్తాయనే నమ్మకముందన్నారు. దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నాగార్జునసాగర్, వైజాగ్, ముంబైలలో షూటింగ్ చేశామని చెప్పారు. ఈ రోజుతో షూటింగ్ పార్ట్ పూర్తయిందన్నారు. చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, చక్కటి సందేశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కామెడీకి పెద్దపీట వేశామని దర్శకనిర్మాత తెలిపారు. తాను పడిన శ్రమక ఈ చిత్రం తగిన ఫలితాన్నిస్తుందని సత్యారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ మొదటివారంలో ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తామని చెప్పారు. నిర్మాణానంతర పనులను ఈ రోజునుంచే మొదలుపెట్టి, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు. కాగా చలనచిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్. రాజశేఖర రెడ్డికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కరిష్మాకొటక్, ఫరాఖాన్, భువనేశ్వరి, తెలంగాణా శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, కొండవలస, కళ్లు చిదంబరం, కవిత, గుండు హనుమంతరావు, జెన్ని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బొంబాయిరవి, కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: రామకృష్ణా, నిర్వహణ: పి. సతీష్‌రెడ్డి, ఆర్. సూర్యప్రకాష్, సహనిర్మాతలు: తలశిల శ్రీనివాస్, డి. కిషోర్‌కుమార్, సమర్పణ: యస్. నర్శిరెడ్డి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: పి. సత్యారెడ్డి.

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు కోల్పోయి 16,186 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 4,790 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.60 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు క్షీణించాయి.బీఎస్ఈ మధ్యతరహా కంపెనీల ఇండెక్స్ 1.31 శాతం, బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 1.00 శాతం మేరకు క్షీణించాయి.

ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కొనసాగించగలనా…? ఏమైనా సమస్యలున్నట్లయితే దయచేసి చెప్పగలరు…

వెంకటరమణారావు-విశాఖపట్నం:మీరు సప్తమి మంగళవారం కర్కాటక లగ్నము పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీరు చదువుల్లో నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల, అష్టమ స్థానము నందు శని ఉండటం వల్ల మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో కంటే ప్రైవేట్ సంస్థలలో బాగా రాణిస్తారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు తనమును నివారించడం మంచిది. 2018 వరకు రాహు మహర్ధశ జరుగుతున్నందువల్ల ఈ రాహువు మీకు వ్యయము నందు ఉండటం వల్ల, ధనం ఎంత సంపాదించినా ఏ మాత్రం నిల్వచేయలేకపోతారు.

Log in |Designed by Gabfire themes WordPress主题
Wp Advanced Newspaper WordPress Themes Gabfire