Archive for: December, 2009

నేపాల్‌లో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదు!

నేపాల్‌లో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. మరో ఇద్దరికి హైచ్1ఎన్1 వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి నేపాల్‌లో కూడా ప్రవేశించింది. దీనిపై నేపాల్ స్టేట్ మీడియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వైన్ ఫ్లూ వైరస్ ధాటికి 30 సంవత్సరాల మహిళ బిర్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇతర అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ మహిళకు వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. భక్తాపూర్ పట్టణానికి చెందిన ఆమె 19 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా, శరీరంలోని వివిధ అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతిని ఉన్నదని వైద్యుడు ప్రదీప్ కోయిరాలా వెల్లడించారు. కాగా, రాజధాని ఖాట్మండులోని జనమైత్రి హాస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ఒక మహిళ కూడా మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈమె మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దక్షిణ నేపాల్‌లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం చిత్వాన్‌కు చెందిన వాసిగా గుర్తించారు. కాగా, గత జూన్ నెలలో అమెరికా నుంచి నేపాల్‌కు వచ్చిన ఒక కుటుంబ సభ్యుల్లో ఈ వైరస్ లక్షణాలు గుర్తించిన విషయం తెల్సిందే. వీరికి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేసిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఇదిలావుండగా, నేపాల్‌ను ఆనుకుని ఉన్న భారత్‌లో స్వైన్ ఫ్లూకు 852 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే.

సంక్రాంతి కానుకగా వెంకీ, త్రిషల "నమో వెంకటేశ"!

విక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్లల తొలి కాంబినేషన్‌లో వస్తోన్న “నమో వెంకటేశ” చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ చిత్రాల్లో అద్భుతమైన కామెడీ చేసిన విక్టరీ వెంకటేష్ వెంకీ, ఢీ, రెడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సూపర్ కామెడీ పండించిన హ్యాట్రిక్ డైరక్టర్, శ్రీనువైట్లతో కలిసి చేస్తున్న “నమో వెంకటేశ” చిత్రం వెంకీ, శ్రీనువైట్ల కెరీర్‌ల్లోను బంపర్ హిట్ అవుతుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సంక్రాంతికి “నమో వెంకటేశ” విడుదలవుతున్న సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. “ఇంతకుముందు చేసిన చిత్రాల కంటే “నమో వెంకటేశ” చిత్రంలో చేసిన కామెడీ పీక్ లెవల్‌లో ఉంటుందన్నారు. శ్రీనువైట్లకు కామెడీలో మంచి నైపుణ్యం ఉంది. ఈ సబ్జెక్టులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్, యాక్షన్, సెంటిమెంటి వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌కు ఇది పర్‌ఫెక్ట్ సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ రాము, గోపి, అనిల్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” తర్వాత త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని వెంకీ అన్నారు. దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. “నాకెంతో ఇష్టమైన వెంకటేష్‌బాబుతో “నమో వెంకటేశ” చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి పండగకు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఓ విందు భోజనంలాంటి “నమో వెంకటేశ” చిత్రాన్ని అభిమానులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా సోదరుల్లా పనిచేసిన నిర్మాతలు తొలి సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ అయ్యేలా శ్రమించారు. ఈ సంక్రాంతికి “నమో వెంకటేశ” విజయం మా యూనిట్ అందరికీ పెద్ద గిఫ్ట్ అవుతుందని భావిస్తున్నాం” అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. వెంకటేష్, శ్రీనువైట్లతో తొలి కాంబినేషన్ అంటే అందరూ చాలా పెద్ద స్థాయిలో అంచనా వేస్తారు. ఆ అంచనాలకు ధీటుగా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా “నమో వెంకటేశ” తయారవుతోంది. ఈ నెల నాలుగో తేదీన ఆదిత్య ద్వారా ఆడియో విడుదలవుతుంది. ఈ నెల 3 నుంచి ఆరు వరకు విదేశాల్లో వెంకటేష్, త్రిషలపై ఓ పాట చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతికి కానుకగా “నమో వెంకటేశ”ను విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, జె.పి., ఎం.ఎస్. నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముఖేష్ రుషి, సుబ్బరాజు, సత్యప్రకాష్, కాశీ విశ్వనాధ్, జీవా శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ: గోపిమోహన్, సహాయ రచయిత: శ్రీధర్ సీపన, మాటలు: చింతపల్లి రమణ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, మేకప్: రాఘవ, కాస్ట్యూమ్స్: శివ, స్టిల్స్: పాండ్యన్, ఆపరేటివ్ కెమెరామెన్: సూర్యతేజ, మేనేజర్స్: జి. వెంకటేశ్వరరావు, రాంబాబు, జె. మహేష్, దర్శకత్వ శాఖ: బి.వి.వి.ఎస్. చౌదరి, సురేష్ నడికొప్పుల, సుభాష్ జెట్టి, ఎ.రమేష్, కో-డైరక్టర్స్: సాయికిషోర్ మచ్చా, సూర్య, వరుణ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: బ్రహ్మానందం, కొరియోగ్రఫీ: శంకర్, కళ్యాణ్, శోభి, ఫైట్స్: విజయ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురెళ్ళ, సంగీతం: దేవీశ్రీప్రసాద్.

సిడ్నీలో రామ్‌చరణ్, జెనీలియాల కొత్త చిత్రం!

ప్రతిష్టాత్మక అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, జెనీలియా, షాజన్ పదంసి హీరోయిన్లుగా రూపొందిస్తున్న మెగా మూవీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి సిడ్నీలో షూటింగ్‌ జరుపుకోనుంది. కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి “బొమ్మరిల్లు” భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ.. “తొలి షెడ్యూల్ ముంబైలో డిసెంబర్ 11 నుంచి 20వరకు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఫిబ్రవరి మొదటివారం నుంచి సిడ్నీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మా బ్యానర్‌లో హైటెక్నికల్ వాల్యూస్‌తో, కాంప్రమైజ్ అన్న పదానికి తావివ్వకుండా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాల తర్వాత భాస్కర్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అలాగే అందరి అంచనాలను మించే విజయాన్ని సాధించే విధంగా మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అని చెప్పారు.

Shajan

WD

బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణీత్, కల్పిక, ప్రగతిక తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ రెడ్డి, సంగీతం: హారిస్ జైరాజ్, పాటలు: వనమాలి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఫైట్స్: పీటర్ హెయిన్స్. ఇంకా కొరియోగ్రాఫర్: బోస్కో కేసర్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మాటలు : తోటప్రసాద్, మేకప్: శివ, కాస్ట్యూమ్స్: షాజీ, స్టిల్స్: గుణ, కో-డైరక్టర్స్: ప్రణదీప్, పీవీవీ సోమరాజు, ప్రొడక్షన్ కంట్రోలర్ : మోహన్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్, నిర్మాత: కె. నాగేంద్ర బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.

దయచేసి తెలుగు గడ్డను ముక్కలు చేయొద్దు: లగడపాటి

కేంద్ర మంత్రి చిదంబరం పార్టీలను చర్చలకు ఆహ్వానించడాన్ని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తప్పుపట్టారు. ఒకవేళ కొన్ని ఓడిపోయిన పార్టీలు చెప్పిన మాటను అనుసరించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యమైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.తెలంగాణా విభజన అంశంపై ముందుగా రాష్ట్ర స్థాయిలో చర్చ జరగాలనీ, ఆ తర్వాతే కేంద్ర స్థాయిలో చర్చలు జరగాలని సూచించారు. దానికి భిన్నంగా కేంద్ర స్థాయిలో చర్చలు నిర్వహించడంపై తప్పు పట్టారు. తమ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణా అంశాన్ని జోడించినప్పటికీ… ఆ అంశంలో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించిన తర్వాతే నిర్ణయం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నట్లు సమర్థించుకున్నారు.తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా వెనకబడిపోయిందని చెప్పడం నిజం కాదన్నారు. 1956 తర్వాత క్రమంగా సీమాంధ్రకంటే తెలంగాణా ప్రాంతం అభివృద్ధి బాటలో ముందున్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ఈ విషయంపై ఏ పార్టీతోనైనా ముఖాముఖి చర్చించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.రాష్ట్ర రాజధాని నడిబొడ్డున విజయకేతనం ఎగురవేసే ఎంఐఎం పార్టీ కలిసుందాం అని అంటోందన్నారు. ఎందుకంటే కలిసి ఉండటం వల్ల కేంద్రం నుంచి అధిక నిధులను రాబట్టుకునే శక్తి ఉంటుందన్నారు. విడిపోవడం వల్ల తెలంగాణా గానీ, సీమాంధ్రగానీ పూర్తిగా శక్తిహీనమై పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ తమ స్వార్థప్రయోజనాలకోసం చూస్తున్నారన్నారు. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నాయన్నారు. వారి కుట్రలను ప్రజలందరూ సమైక్యంగా భగ్నం చేయాలంటే అందరూ సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దయచేసి తెలుగు గడ్డను ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడిపై ఉందని చెప్పారు.

నా భవిష్యవివరాలను తెలియజేయగలరు…

వి. సూర్యకాంతం-కర్నూలు:మీరు పంపిన రామ పంచమి మంగళవారం కన్యాలగ్నము మృగశిర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్రుడు నీచి పొందడం వల్ల ఈ శుక్రుడు ధన భాగ్యాధిపతి అవడం వల్ల మీ 31వ సంవత్సరము నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. 2012 వరకు అర్ధాష్టమం కాబట్టి నెలకు ఒక శనివారంనాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఎర్రని పూలతో పూజించినట్లైతే మీకు దోషం తొలగి అభివృద్ధి కానవస్తుంది.

నాకు వివాహం జరిగినప్పటి నుంచి ఇంట్లో గొడవలు…

లక్ష్మికుమారి ఖమ్మం:మీరు నవమి మంగళవారం కుంభలగ్నము మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. కుటుంబస్థానము నందు, ధనస్థానము నందు, వాక్‌స్థానము నందు కేతువు ఉండటం వల్ల మీ భర్తకు స్థిరబుద్ధి లేకపోవడం, మీకు కుటుంబ సౌఖ్యము లేకపోవడం, ఖర్చులు అధికమవడం, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటున్నారు. 2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో నెలకు ఒకసారి తైలాభిషేకం చేయించి ఏడు వత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసి కర్కోటక కాలసర్పదోషానికి శాంతి చేయించినట్లైతే ధనప్రాప్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కారమవడం, మీ భర్తకు స్థిరబుద్ధి చేకూరుతుంది.

తిరుమలలో జనవరి 1న నిజపాద దర్శనం రద్దు!

కొత్త సంవత్సరాది రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిజపాద దర్శనాన్ని రద్దు చేశారు. నేటి రాత్రి (డిసెంబర్ 31) అర్థరాత్రి 12.21 నుంచి 1.24 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్ర గ్రహణం కారణంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసి వేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయాన్ని నేటి సాయంత్రం ఏడు గంటలకు మూసి వేస్తున్నారు. దీంతో పాటు నిజపాద దర్శనాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంతో పాటు రాష్ట్రంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఖమ్మంలోని భద్రాచలం రామాలయం, నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్ట వంటి తదితర ఆలయాలను మూసివేస్తారు.

అథ్లెట్లూ.. భద్రత గురించి భయం వద్దు : కల్మాడీ

వచ్చే సంవత్సరం భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనే అథ్లెట్లు ఎవ్వరూ భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదని.. కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ బుధవారం స్పష్టం చేశారు. అక్టోబర్ 3 నుంచి 14వ తేదీవరకు ఢిల్లీలో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్లపై తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు.కాగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లపై తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్న కారణంగా, వారు కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేదీ, లేనిదీ సందేహమేననంటూ టెలిగ్రాఫ్ పత్రిక మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెలరేగిన అనుమానాలకు కల్మాడీ ఫుల్‌స్టాఫ్ పెడుతూ.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి భయాలూ, సందేహాలూ అనవసరం అని తేల్చి చెప్పారు.ఈ టోర్నీ పాల్గొనే ప్రపంచవ్యాప్త అథ్లెట్లు అందరికీ వారి భద్రత గురించి గట్టి హామీని ఇస్తున్నట్లు కల్మాడీ వివరించారు. ఆటగాళ్ల భద్రత అంశంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందనీ, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. టెలిగ్రాఫ్ కథనంపై స్పందించిన కల్మాడీ… ఆ వార్తను చూసి ముందుగా ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే ఇలాంటి వార్తలన్నీ అవాస్తవాలనీ, వాటిని నమ్మాల్సిన పనిలేదని ఆయన కొట్టిపడేశారు.

ప్రమాదంలో ఉడ్స్‌కి పెద్దగా గాయాలేమీ తగల్లేదట..!!

అమెరికన్ గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్‌కి జరిగిన కారుప్రమాదంలో అతడికి పెద్దగా గాయాలేమీ తగల్లేదనీ, పెదవి మాత్రం ఉబ్బిపోయి కనిపించిందనీ ఓ టీవీ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తరువాత కలిసిన ఫ్లోరిడా రాష్ట్ర పర్వత ప్రాంత పోలీసులకు ఉడ్స్ పెదవి మాత్రం కాస్త ఉబ్బిపోయి కనిపించిందనీ, ముఖంలో ఇంకెక్కడా గాయాల్లాంటివేమీ కనిపించలేదని ఈ రిపోర్టు కథనం.ఈ విషయమై ఫ్లోరిడా హైవే పెట్రోల్ స్పోక్స్ ఉమెన్ కిమ్ మోంట్స్.. ఓర్లాండోలోని వేష్ టీవీతో మాట్లాడుతూ.. ఉడ్స్ అతని అటార్నీ పర్వత ప్రాంత పోలీసులను డిసెంబర్ ఒకటవ తేదీన కలిశారని చెప్పారు. ఈ సందర్భంగా ఉడ్స్ పెదవికి చిన్నపాటి గాయమై ఉబ్బిపోయి కనిపించింది తప్ప, ఇతర గాయాలేవీ కనిపించలేదని అన్నారు.ఇదిలా ఉంటే.. నవంబర్‌ 27వ తేదీ అర్థరాత్రి ఫ్లోరిడాలోని స్వగృహం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే టైగర్‌ ఉడ్స్‌ కారు ఒక చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుండి టైగర్‌ ఉడ్స్‌ క్షేమంగానే బయటపడ్డాడు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ప్రమాదంలో పడింది. ఆ తరువాత అతని రాసలీలల భాగోతం ఒక్కోటి వెలుగుచూడగానే ప్రపంచం నివ్వెరపోయింది, అతని క్రీడా జీవితం కూడా ప్రమాదంలో పడిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే.

వచ్చే సీజన్‌ను మెరుగ్గా ఆరంభిస్తా : రఫెల్ నాదల్

ఈ ఏడాదికంటే వచ్చే 2010 సీజన్‌ను మరింత మెరుగ్గా ఆరంభిస్తానని ప్రపంచ టెన్నిస్ రెండో నెంబర్ ఆటగాడు రఫెల్ నాదల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాదికి సన్నాహకాలు తక్కువగా ఉన్నప్పటికీ మరింత మెరుగ్గా ఆడేందుకు సన్నద్ధమవుతున్నానని అన్నాడు.సంవత్సరంలో ఎక్కువగా మోకాలుకు, కడుపుకు తగిలిన గాయాలతో బాధపడ్డప్పటికీ, త్వరగా కోలుకున్నానని నాదల్ చెప్పాడు. రెట్టించిన ఉత్సాహంతో రాబోయే కొత్త సీజన్‌‌లో విజయాల ఖాతాను తెరుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కేవలం మూడు వారాల సమయంలో శిక్షణ తీసుకున్నా, కొత్త సీజన్‌ను సరికొత్తగా ఆరంభిస్తానని అన్నాడు.ప్రస్తుతం వచ్చే నెలలో జరుగనున్న ఖతార్ ఓపెన్‌‌లోనూ, ఆ తరువాత జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ నాదల్ పాల్గోనున్నాడు. ఈ నేపథ్యంలో నాదల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను మళ్లీ సాధించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. కాగా.. గత సంవత్సరం రాబిన్ సదర్లింగ్ నాలుగో రౌండ్లో విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే.

Log in |Designed by Gabfire themes Free WordPress Theme
Wp Advanced Newspaper WordPress Themes Gabfire