భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం భారత్ ఏమాత్రం చొరవ చూపడం లేదని పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ ఆరోపించారు. దీనిపై ఆయన శుక్రవారం లండన్‌లో మాట్లాడుతూ సంబంధాల పునరుద్ధరణ కోసం తమతో చర్చలు జరిపేందుకు భారత్ ఏమాత్రం చొరవ చూపడం లేదన్నారు. ఇదేపరిస్థితి కొనసాగిన పక్షంలో సంబంధాల పునరుద్ధరణ అసాధ్యమవుతుందన్నారు. ఇకపోతే ఐపీఎల్ వేలం పాటల్లో పాక్ ఆటగాళ్లను పక్కన పెట్టడం వల్ల మంత్రి తప్పుబట్టారు. ఈ చర్య ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీస్తాయన్నారు. కాగా, మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఇదిలావుండగా, భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఎస్ఎం.కృష్ణ, మొహ్మద్ ఖురేషీలు లండన్‌లో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని భారతీయులపై యధేచ్చగా దాడులు కొనసాగుతున్నాయి. వీటిని అరికడతామని సాక్షాత్ ఆ దేశ ప్రధాని కెవిన్ రుఢ్ ఇచ్చిన హామీ కూడా బుట్టదాఖలైంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ, ఆస్ట్రేలియా విదేశాగ మంత్రి స్టీఫెన్ స్మిత్‌లు గురువారం భేటీ కానున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌పై జరిగే సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దరు సమావేశం కావాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడులే ప్రధానాంశంగా ఈ భేటీ సాగనుంది. భారతీయ విద్యార్థులపై పెరుగుతున్న దాడుల పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం గట్టిగా కోరుతోంది. ఇవి జాత్యహంకార దాడులు కావని చెబుతున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటిని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కృష్ణ కోరనున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారతీయ విద్యార్థిపై జరిగిన దాడి కేసులో ఆ ప్రాంతానికి చెందినస దంపతులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దంపతుల పేర్లను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించక పోవడం గమనార్హం.గత యేడాది డిసెంబరు 29వ తేదీన సిడ్నీలో ఒక విద్యార్థిపై కొందరు దాడి చేసిన విషయం తెల్సిందే. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యకు గురైన విద్యార్థి పేరు రణజ్యోత్ సింగ్‌గా తేల్చారు. ఈ హత్య కేసులో సిడ్నీకి చెందిన భార్యాభర్తలకు సంబంధం ఉన్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేశారు. వారి పూర్తి వివరాలను వెల్లడించాల్సి వుంది.
ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా దేశంలో నిరుద్యోగస్తుల సంఖ్య పెరిగిపోయిందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ సమస్య నివారణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇందులోభాగంగా మరో యేడాదిలో కొత్తగా 15 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి తాజాగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ తీవ్రతను నియంత్రించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం మరో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇకపోతే.. ఇది అమెరికాకు పరీక్షాకాలమన్నారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి ముందుకు సాగుతామన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమవాళ్ళను సమర్థవంతంగా అధిగమిస్తామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆసియా దేశాలతో ఉత్తమ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తామని ఒబామా ప్రకటించారు.