భారత్-పాకిస్థాన్ చర్చలను స్వాగతించిన అమెరికా
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాలు తిరిగి చర్చలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్చల్లో భాగంగా తొలుత విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిపేందుకు భారత్ ప్రతిపాదన చేయగా, దీనికి జర్దారీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై ఒబామా సర్కారు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై విదేశాంగ శాఖ కార్యాలయంలోని ప్రజా వ్యవహారాల విభాగం సహాయ మంత్రి పిజె క్రౌలీ మీడియాతో మాట్లాడుతూ భారత్ చేసిన ప్రతిపాదన స్వాగతించదగిన ముందడుగుగా అభివర్ణించారు. భారత్-పాక్‌ల మధ్య చర్చల ప్రక్రియను తాము పూర్తిగా సమర్థిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇరు దేశాల్లో కాకుండా, ఆసియా ఉప ఖండంలోనే సుస్థిర శాంతి సాధనకు ఈ రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Short URL: http://www.andhranews.in/?p=189669






