మీ డిమాండ్ మేరకు సయీద్‌పై చర్య తీసుకోలేం: పాక్
పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం తన రెండు రోజుల ఇస్లామాబాద్ యాత్రను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మరుక్షణమే పాక్ పాలకులు మాట మార్చారు. భారత్ చేస్తున్న డిమాండ్ మేరకు.. జేషే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆ దేశం ఉగ్రవాద నిర్మూలనకు ఏమేరకు కట్టుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ డిమాండ్‌పై పాక్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ఇలాంటి వారిలో సయీద్ కూడా ఒకరని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్న సయీద్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని భారత్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాదిరిగానే పాకిస్థాన్‌లోనూ భావప్రకటనా స్వేచ్ఛ ఉందన్నారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రసంగాలు చేసుకోవచ్చని చెప్పారు. తీవ్రవాద భావాలున్న ప్రజలు ఇటు పాకిస్థాన్‌లోనూ, అటు భారత్‌లోనూ ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమన్నారు. ఇరు దేశాల్లోని మెజార్టీ ప్రజలు రెచ్చగొట్టే ప్రసంగాలను అంగీకరించబోరని, శాంతిని, అభివృద్ధిని కోరుకునే వీరు పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉండాలని కాంక్షిస్తారని చెప్పుకొచ్చారు.