ఉప ఎన్నికల ప్రచారంలో బాబ్లీ ఉద్యమ ప్రభావం: దేవేందర్
తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలెవ్వరూ పాల్గొనలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుర్తు చేశారు. ఈ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాలపై ఉందని గౌడ్ చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల ఫలితాలపై దేవేందర్ గౌడ్ శుక్రవారం స్పందిస్తూ బాబ్లీ ఉద్యమాన్ని కేవలం తెలంగాణ ఉప ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో చేపట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చుక్క నీరు రావని, దీనివల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఉద్దేశ్యంతోనే చేపట్టామన్నారు. అందువల్లే తెలంగాణ ఉప ఎన్నికల్లో తాము ప్రచారం చేయలేక పోయామన్నారు. ఈ ప్రభావం ఉప ఎన్నికలపై పడిందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఒక రాజకీయ పార్టీ మనుగడను అంచనా వేయలేమన్నారు. తెదేపా తిరిగి ఖచ్చితంగా పుంజుకుంటుందని దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు.
Short URL: http://www.andhranews.in/?p=321014






